Kadambari Kiran Manam Saitham Contribution For Education

 


చదువుల తల్లికి అండగా నిలిచిన 'మనం సైతం' కాదంబరి కిరణ్

పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు 'మనం సైతం' కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు.


తేజస్వి తల్వ అమెరికా లోని అలబామాలో సైబర్ సెక్యూరిటీ లో ఎంఎస్ చేద్దామని ఆశపడింది. కానీ ఆర్ధిక బలం లేదు, తండ్రి చనిపోయాడు, దిక్కుతోచని స్థితిలో 'మనం సైతం' ని ఆశ్రయించింది. ఆ పాపను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని దృఢ సంకల్పం తీసుకున్న కాదంబరి కిరణ్...తన మిత్రుల సహకారాన్ని కోరారు. అమెరికాలోని అట్లాంటలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్ కమలాపురం సాయిశశాంక్ కమలాపురం 1 లక్షా 60 వేల రూపాయలు, బోయినపల్లి రమేష్ రూ. 10 వేలు, బోయినపల్లి సతీష్ రూ. 10 వేలు, వేముల రామ్మోహన్ రూ. 10 వేలు, వద్ది వెంకటేశ్వరరావు రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేశారు. మనం సైతం కుటుంబంతో కలసి మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందించారు.


ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.....'మనం సైతం' ద్వారా ఇవాళ మరో పెద్ద సాయం చేయగలిగాను. చదువులో అద్భుత ప్రతిభ గల తేజస్వి తల్వ తండ్రి చనిపోయి ఆర్థిక కారణాలతో ఉన్నత విద్యను చదువుకోలేకపోతోంది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం వచ్చినా డబ్బులు లేక అక్కడికి వెళ్లలేకపోతోంది. 'మనం సైతం' దగ్గరకు ఆ బిడ్డ వచ్చిన వెంటనే ఆమెకు సహాయం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అమెరికాలోని అట్లాంటలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్ కమలాపురం సాయిశశాంక్ కమలాపురం 1 లక్షా 60 వేల రూపాయలు అందించారు. ఇతర మిత్రులు కూడా వీలైనంత సాయం చేశారు. మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందించాను. ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది. ఆ దేవుడి దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా 'మనం సైతం' ముందుంటుంది. అన్నారు.


తేజస్వి తల్వ మాట్లాడుతూ...నేను ఇంజినీరింగ్ పూర్తయ్యాక మాస్టర్స్ చేయాలన్నది నా కల. మా నాన్నగారు అకస్మాత్తుగా చనిపోవడంతో నా కలలన్నీ చెదిరిపోయాయి. ఆర్థికంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఇక నేను మాస్టర్స్ చేద్దామనే కలను వదిలేసుకున్నాను. ఇలాంటి టైమ్ లో అమెరికా అలబామాలోని యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కు అడ్మిషన్ ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. ఎన్నో ఛారిటీ సంస్థలను సంప్రదించాం, మా బంధువులను అడిగాం. ఎవరూ సాయం చేయలేదు. ఈ చదువు ఆపేద్దాం అనుకునే సమయంలో చివరి ప్రయత్నంగా మనం సైతం కాదంబరి కిరణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయన ఎంతో ధైర్యం చెప్పి నా చదువుకు సాయం చేశారు. తండ్రి లేని లోటు తీర్చారు. మా అమ్మ నాకు ఇన్నాళ్లూ తోడుగా ఉంది. ఇప్పుడు తల్లిలాంటి 'మనం సైతం' అండ దొరికింది. కిరణ్ గారికి మా నేను, మా కుటుంబం రుణపడి ఉంటాం. ఒక మనిషి కోసం మరో మనిషి నిలబడగలడు అనే నమ్మకం కిరణ్ గారిని చూశాక ఏర్పడింది. అన్నారు.


Post a Comment

Previous Post Next Post