ఉదయ్ కిరణ్ పక్కన 'ఈరోజుల్లో' భామ
ఉదయ కిరణ్ ... ఒకప్పుడు అతనంటే యూత్ లో విపరీతమైన క్రేజ్. 'చిత్రం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఉదయ్ కిరణ్, ఆ తరువాత 'నువ్వు నేను' ... 'మనసంతా నువ్వే' వంటి చిత్రాలతో కుర్రకారు ప్రేక్షకులని తన అభిమానులుగా చేసుకున్నాడు. అయితే ఆ తరువాత అతను ఏ సినిమా పడితే ఆ సినిమాని ఒప్పుకోవడం ... అవి పరాజయాల పాలుకావడం జరిగింది. దాంతో అప్పటివరకూ అతను సాధించిన సక్సెస్ లు పాలపొంగులా చప్పున చల్లారి పోయాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కథానాయకులు దూసుకురావడంతో, అతనికి తెలుగు తెరతో ఎక్కువ గ్యాప్ ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితుల్లోనే ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఫైవ్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై తేళ్ళ రమేష్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి బాలాజీ ఎన్.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైం బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ గా ఉదయ్ కిరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో అతని జోడీగా 'ఈ రోజుల్లో' ఫేం రేష్మా నటిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఈ నెల 18 న మొదటి షెడ్యూల్ ని ఆరంభించామనీ ... నెలాఖరు వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని చెప్పారు. ఈ షెడ్యూల్లో రెండు పాటలను ... కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తామని అన్నారు.
Post a Comment