cinemaki veldam randi ready to release


రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘సినిమాకెళ్దాం రండి’ ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సునీతా ప్రభాకర్, సీత నెక్కంటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం.జి. రెడ్డి దర్శకుడు. బుధవారం నిర్మాతల మండలి హాలులో జరిగిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “నా దృష్టిలో సినిమా ప్రయోజనం వినోదింపజేయడం. ఆ పరంగా చూసుకుంటే ‘సినిమాకెళ్దాం రండి’ వంద శాతం ప్రేక్షకుల్ని వినోదింపజేస్తుంది. ఇంటర్వెల్‌లో ఎవరూ ఊహించని మలుపు ఉంటుంది. గాంధీరెడ్డికి దర్శకుడిగా ఇది తొలి చిత్రమైనా చాలా బాగా తీశాడు.
ఇందులో నేను యముడిగా ఓ మారువేషం వేశా. టైటిల్‌కు న్యాయం చేసే సినిమా” అన్నారు. నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ “దర్శకుడు కథ చెప్పినప్పుడు ఏం అనుకున్నామో, సినిమా చూశాక అదే అనుకున్నాం. చాలా బాగా తీశాడు. రాజేంద్రప్రసాద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు” అని చెప్పారు. దర్శకుడు ఎం.ఎం.జి. రెడ్డి మాట్లాడుతూ “డైరెక్షన్ చెయ్యగలనా అని మొదట్లో కాస్త భయం ఉండేది. కానీ రాజేంద్రప్రసాద్ ఎప్పుడైతే సెట్స్ మీదకు వచ్చారో అప్పుడా భయం పోయింది. నా తొలి సినిమాలోనే ఆయన్ని డైరెక్ట్ చేయడం నా అదృష్టం” అన్నారు.
మాస్టర్ భరత్, రవిబాబు, రాజీవ్ కనకాల, నాగినీడు, రచనా మౌర్య, ఎమ్మెస్ నారాయణ, ఆశా షైనీ, శ్రీమాన్, లీనా సిద్ధు, మురళీకృష్ణ, వర్షిణి, వల్లభనేని జనార్దన్, తాగుబోతు రమేశ్, ప్రియాంక, సానియా శ్రీవాస్తవ్, కీర్తి తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: దుర్గాప్రసాద్, సంగీతం: శ్రావణ్, ఛాయాగ్రహణం: రామాంజీ, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నారాయణరెడ్డి, సమర్పణ: హారిక.

Post a Comment

Previous Post Next Post