రామ్ చరణ్ - సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన 'రచ్చ' సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లను వసూలు చేస్తోన్న నేపథ్యంలో, ఈ సినిమా యూనిట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో విజయోత్సవ వేడుకను జరుపుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ... ఊహించినట్టే తమ చిత్రం 3 రోజుల్లో 15 కోట్ల షేర్ వసూలు చేసిందని చెప్పారు. హీరోగా రామ్ చరణ్ ... దర్శకుడిగా సంపత్ నంది ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదనీ, వాళ్ల శ్రమకి తగిన ఫలితం దొరికిందని నిర్మాతలు అన్నారు.
ఈ సినిమా సక్సెస్ ని కోరుకునే సాంకేతిక నిపుణులంతా అహర్నిశలు కృషి చేశారనీ ... ఆ కారణంగానే ఇంతటి విజయాన్ని సాధించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళ్లో 'రాగలై' పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్లను వసూలు చేస్తోందనీ ... మలయాళంలో ఈ నెల 13 న రిలీజ్ చేయబోతున్నామని అన్నారు. ఇక్కడలానే అక్కడ కూడా ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా పాల్గొన్నారు.
ఇదిలా వుంటే ... ఈ సినిమాలోని 'వానా వానా' పాటలో బుద్ధుడి ప్రతిమ ఎదురుగా నాయికా నాయకులు చేసిన డాన్స్ బౌద్ధుల మనో భావాలను కించపరిచేలా ఉందనీ ... వెంటనే ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని 'ఆలిండియా బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్' హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇదే విషయమై ఇటీవల మహిళా సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. తాజాగా ఈ వివాదం కోర్టుకెక్కడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Post a Comment