నాగార్జున భార్య, ప్రముఖ నటి అమల మళ్లీ సినిమాలలో నటిస్తోందా? ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ టాపిక్ మీదే చర్చలు జరుగుతున్నాయి. శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రం ద్వారా ఆమె మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 'ఘర్షణ', 'శివ', 'రాజావిక్రమార్క'... వంటి పలు చిత్రాలలో కథానాయికగా నటించి, మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న అమల నాగార్జునను వివాహమాడిన తర్వాత నటనకు స్వస్తి చెప్పి గృహిణిగా స్థిరపడింది. ఎంత మంది అడిగినా ఆమె నటనకు మళ్లీ అంగీకారం తెలుపలేదు.
బ్లూక్రాస్ సంస్థను నెలకొల్పి, సామాజిక సేవా కార్యక్రమాలలో ఆమె నిరంతరం బిజీగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తన సినిమాలోని ఓ కీలక పాత్ర గురించి వివరించి, కన్విన్స్ చేయడంతో ఆమె ఒప్పుకున్నారట. ఈ పాత్ర ఆమె స్థాయికి తగ్గట్టుగా హుందాగా ఉంటుందని అంటున్నారు. ఏమైనా, ఓ చక్కని నటి మళ్లీ వెండితెరకు వేంచేయడం శుభపరిణామం!
Post a Comment