౩ డి లో టైటానిక్ ప్రేమనేది మనసునే కాదు ... మరణాన్ని కూడా జయిస్తుందనే కథా కావ్యానికి అద్భుతమైన దృశ్య రూపానిచ్చిన చిత్రం 'టైటానిక్'. లియోనార్డో డికాప్రియో - కేట్ విన్స్లెట్ జంటగా నటించిన ఈ సినిమా 1997 లో విడుదలై, ప్రపంచ సినీ చరిత్రలో ఓ సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. ప్రేమకే కాదు ... ప్రేమ కథాకావ్యాలకి కూడా అపజయమనేది లేనేలేదని మరోసారి నిరూపించింది. అనూహ్యమైన రీతిలో బాక్సాఫీసు రికార్డులని భారీస్థాయిలో తిరగరాసింది. జాన్ లాండర్ నిర్మాణంలో జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ సినిమా, త్వరలో 3 డి రూపంలో ప్రేక్షకుల ముందుకురానుంది.
అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, సరికొత్త సంచలనానికి తెరతీయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ ద్వారా ఈ సినిమాని ఏప్రిల్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి 3 డి వెర్షన్ లో రానున్న ఈ సినిమాకి ప్రపంచ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది
Post a Comment