2010 లో 'సింహా' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి, దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత నిర్మిస్తోన్న చిత్రం 'నా ఇష్టం'. ఈ నెల 23 న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దగ్గుబాటి రానా, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా ప్రకాష్ తోలేటి అనే యువకుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్ సాధించింది. ఈ సందర్భంగా ఈ నిర్మాత ఇంటర్వ్యూ...
'నా ఇష్టం' కథాంశం ఏమిటి?
ఇదొక కమర్షియల్ చిత్రం. ఒక స్వార్ధపరుడైన కుర్రాడు అనుకోని పరిస్థితులలో ఓ అమ్మాయి జీవితంలోకి ప్రవేశించాక, తన స్వార్ధాన్ని వీడి, ఎలా ఆమె సమస్యని తీర్చాడన్నది కథ. మలేషియా నేపథ్యంలో సాగుతుందిది.
హీరో రానా గురించి?
తనకి ఇదే మొదటి కమర్షియల్ సినిమా అవుతుందని చెప్పుకోవచ్చు. లీడర్, నేను నా రాక్షసి... కాన్సెప్ట్ ఒరిఎంటేడ్ సినిమాలు. ఇందులో తన పాత్ర చాలా కమర్షియల్ పాత్ర. ఎంతలా అంటే, తనకు ఉపయోగపడుతుందంటే ఏదైనా సరే చేసే రకం. అభినయం పరంగా కూడా రానా ఇందులో చాలా ఇంప్రూవ్ అయ్యాడు.
డ్యాన్సు లు కూడా బానే చేసినట్లున్నాడు?
అవును. తన గత చిత్రాల్లో డాన్సులు తక్కువనే చెప్పుకోవాలి. కమర్షియల్ సినిమా కనుక డాన్సు లు కచ్చితంగా బాగుండాలని చాలా కష్టపడ్డాడు. ప్రేమ రక్షిత్ మాస్టర్, గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో బాగా చేశాడు.
కొత్తగా పెళ్ళైన మీ హీరోయిన్ జెనీలియా గురించి?
ఆమె పెళ్లి కాక మునుపే అంటే సెప్టెంబర్ లోనే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కుదరలేదు. ఇక తన గురించి చెప్పాలంటే ప్రొఫెషనల్ ఆర్టిస్టే. తన పని తాను చేసుకుపోయేది. ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు.
నూతన దర్శకుడు ప్రకాష్ తోలేటి పనితీరు ఎలా ఉంది?
వెరీ టాలేన్టేడ్ పర్సన్. 'సింహా' సూపర్ హిట్ తర్వాత మరో మంచి హిట్ సినిమా చేయాలని ఎన్నో కథలు విన్నాను. ఎవరూ సరైన కథతో రాలేదు. అందరూ సింగిల్ లైన్ తో వచ్చేవాళ్ళు. ఈ సమయంలోనే మా సినిమాలకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఇతన్ని పరిచయం చేసి, కథ వినమన్నాడు. పూర్తి బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చి సినిమా చూపించాడు. వెంటనే చేద్దామని హీరోల వేటలో పడ్డాను. సినిమాని ఒక సీనియర్ డైరెక్టర్ లా చాలా బాగా హాండిల్ చేసాడు.
'నా ఇష్టం' లో హైలైట్స్ ఏమని భావిస్తున్నారు?
కథ, స్క్రీన్ ప్లే . ఇవి రెండూ చాలు సినిమాని సూపర్ హిట్ చేయడానికి. అయితే అన్ని విభాగాల మీద పట్టు ఉన్న దర్శకుడు తోడైతేనే అది సాధ్యపడుతుంది. ఈ విషయంలో ప్రకాష్ తోలేటి సక్సెస్ అయ్యాడు. నా వరకు అన్నీ సమకూర్చాను.
బడ్జెట్ పరంగా రానా మార్కెట్ ని దాటిపోయిందని వినికిడి?
ఇక్కడ బడ్జెట్ సమస్య కాదు. నేను నిర్మించిన 'రాజా బాబు', 'టక్కరి', 'గుండె జల్లుమంది' చిత్రాలకు మొదట చెప్పిన బడ్జెట్ వేరు. తీరా అంతా అయ్యాక చూస్తె, నలభై శాతం ఎక్కువై లాస్ అయ్యాను. అందుకే కథనే నమ్ముకుని బడ్జెట్ లిమిట్ లేకుండా 'సింహా' తీశాను. ఇప్పుడు 'నా ఇష్టం' కూడా అలాగే చేశాను. ఇక మార్కెట్ విషయానికొస్తే, ఒక టాప్ హీరో ఒక సినిమాకి యాభై కోట్లు వసూలు చేస్తే, మరో సినిమాకి ఇరవై కూడా వసూలు చేయలేకపోతున్నాడు. సో... ఇక్కడ కథే ముఖ్యం. ఈ విషయంలో మా సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాము.
ఇటీవలే విడుదలైన ఆడియో గురించి?
'సింహా' సినిమా కి ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చిన చక్రి ఈ సినిమాకి కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. 'ఓహ్ సాథియా...', 'నా ఇష్టం...' అంటూ సాగే సాంగ్స్ ఇప్పటికే చాలా పాప్యులర్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఇటీవలె విడుదలైన ట్రైలర్స్ కి మంచి స్పందన వచ్చింది. 'సింహ' ట్రైలర్ తర్వాత అంత బాగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే ట్రైలర్ అని నా భావన.
మేకింగ్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు?
నేను డైరెక్టర్ కి ఒకటే చెప్పాను. ఎంత బడ్జెట్ అయినా పర్లేదు. సినిమా అనుకున్న కాన్సెప్ట్ లో, మంచి క్వాలిటీతో రావాలని చెప్పా. అందుకే కొత్త డైరెక్టర్ అయినా చాలా ఫ్రీడం ఇచ్చాను. మనం తొందరపెడితే కంగారులో అనుకున్న ఫీల్ ని తీసుకురాలేము. సో... పాటల విషయంలో గానీ, టాకీ విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
ఇతర నటీనటుల గురించి?
బ్రహ్మానందం, నాజర్, అలీ, రఘుబాబు, సుబ్బరాజు తదితర టాప్ ఆర్టిస్ట్ లందరూ ఉన్నారు. కామెడీ పరంగా కూడా ఇందులో కొదవలేదు.
మీ తదుపరి చిత్రాలు?
ఈ సినిమాని ఈ నెల 23 న రిలీజ్ చేస్తున్నాము. వెంకటేష్ 'షాడో' 20 శాతం పూర్తయ్యింది. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
Post a Comment