తనకు దక్కిన పాత్రలను గొప్పగా పండించే ప్రతి నటుడూ మహానటుడు కాడు. తనకు తాను నియంత్రించుకుంటూ... తానే పాత్రగా, పాత్రే తానుగా మారిపోయే నటుడే నిజమైన మహానటుడు. అలాంటి కొద్దిమంది నటుల్లో పద్మశ్రీ మోహన్‌బాబు ఒకరు. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రే కనిపిస్తుంది తప్ప ఆయన కనిపించరు. అందుకు ఆయన పోషించిన పాత్రలే నిదర్శనం.
80ల్లో మోహన్‌బాబు విలన్‌గానే ఎక్కువగా నటించారు. గోరంతదీపం, దేవత, చక్రవర్తి, శ్రీనివాసకళ్యాణం, కొదమసింహం... ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన ప్రతినాయక పాత్రలు ఎన్నో. ఒక పాత్రకూ మరో పాత్రకూ పొంతన కనిపించదు. ఆ సమయంలోనే ప్రతిజ్ఞ, పాలునీళ్లు, గృహప్రవేశం, నా మొగుడు నాకే సొంతం, వీరప్రతాప్ లాంటి చిత్రాల్లో హీరోగా నటించారాయన. విలన్‌గా నటిస్తే అలాంటి కర్కశమైన విలన్ వేరొకరు కనిపించరు. ఇక హీరోగా కనిపిస్తే గొప్ప ధీరోదాత్తుడుగానే తెరపై ఆవిష్కృతమౌతారు. దటీజ్... మోహన్‌బాబు! అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ, రౌడీగారి పెళ్లాం, అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్‌చంద్రకాంత్, పెదరాయుడు వంటి ఎన్నో శతదినోత్సవ చిత్రాల్లో నటించి కలెక్షన్‌కింగ్ అనిపించుకున్నారాయన. 500 పై చిలుకు చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ కళామతల్లి ఒడిలో తను విద్యార్థిగానే భావిస్తారు. సినిమాకు దర్శకుడే కెప్టెన్ అని నమ్ముతారు.
సంభాషణలు పలికే తీరులోనూ, హావభావ ప్రకటనలోనూ, క్రమశిక్షణలోనూ, ముక్కుసూటి తనంలోనూ మహానటుడు ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబునే చెప్పుకోవాలనేది పలువురి అభిప్రాయం. ‘మనసుకు నచ్చే పాత్రతో తన దగ్గరికొస్తే... నేటికీ నటించడానికి సిద్ధం’ అంటుంటారు మోహన్‌బాబు. ఆ రకంగా తన దగ్గరికొచ్చిన రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించడానికి తాజాగా ఆయన పచ్చజెండా ఊపినట్టు తెలిసింది.
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు అరవైఏళ్లు నిండుతున్నాయి. ఈ వయసులో కూడా తన కుమారులు విష్ణు, మనోజ్‌లతో పోటీ పడే గ్లామర్ ఆయన సొంతం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తిరుపతిలో ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌లో ఈ పుట్టినరోజును జరుపుకుంటున్నారు మోహన్‌బాబు.
SOURCE :SAKSHI
Post a Comment