అమ్మగా, బామ్మగా తన విశిష్ట శైలి నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి రాధాకుమారి నిన్న రాత్రి గుండెపోటుతో హైదరాబాదులో మరణించారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. ఆమె ప్రముఖ నటుడు రావి కొండలరావుకు సతీమణి. ఈ దంపతులిద్దరూ వెండితెరపైన కూడా పలు చిత్రాలలో భార్యాభర్తలుగా నటించడం విశేషం. నాటక రంగం నుంచి చిత్రసీమలో అడుగుపెట్టిన రాధాకుమారి నాలుగు దశాబ్దాల పాటు నటిగా కొనసాగి, సుమారు 600 చిత్రాలలో నటించారు. సినిమాలలోనే కాకుండా టీవీ సీరియళ్ళలో సైతం ఆమె తనదైన ముద్ర వేశారు. షూటింగులో నలుగురితోనూ కలుపుగోలుగా ఉంటూ సెట్లో ఆమె కుటుంబ వాతావరణాన్ని నెలకొల్పేవారు.
భార్య చనిపోయిన సమయంలో భర్త కొండలరావు అమెరికా ప్రయాణంలో మార్గమధ్యంలో దుబాయ్ లో వున్నారు. అమెరికాలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆయన అక్కడికి వెళుతున్నారు. ఆమె మరణ వార్త విని వెంటనే వెనుదిరిగారు. ఆయన వచ్చిన తరువాత ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. బృందావనం, భైరవద్వీపం, ఒకరికొకరు, చందమామామ వంటి చిత్రాలలో రాధాకుమారి బామ్మ పాత్రలో ప్రదర్శించిన అభినయం అందర్నీ ఆకట్టుకుంది.
Post a Comment