Home » » Nbk Un Stoppable Talk Show in Aha From November 4th

Nbk Un Stoppable Talk Show in Aha From November 4th

 నటసింహ నందమూరి బాల‌కృష్ణతో తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ స‌రికొత్త టాక్ షో ‘అన్ స్టాపబుల్’... దీపావళి సందర్భంగా నవంబర్ 4న ‘ఆహా’లో ప్రసారం
బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, పాత్ బ్రేకింగ్ వెబ్ ఒరిజిన‌ల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇప్పుడు త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూ మ‌న తెలుగు ఓటీటీ మాధ్య‌మం  డ‌బుల్ ఎన‌ర్జీని అందించ‌డానికి సిద్ధ‌మైంది. ఓటీటీ మాధ్య‌మాల్లో సరికొత్త సంచ‌ల‌నానికి సిద్ధ‌మైంది. ఇంత‌కీ ఆ సంచ‌ల‌న‌మేంటో తెలుసా..న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ అగ్ర క‌థానాయ‌కుడు తెలుగు ఓటీటీ మాధ్య‌మమైన ఆహాలో ‘అన్ స్టాప‌బుల్‌’ అనే టాక్‌షోను హోస్ట్ చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా  న‌వంబ‌ర్ 4న ఈ టాక్‌షో ఆహాలో ప్ర‌సారం అవుతుంది. ఈ సంద‌ర్బంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు నిర్మాత అల్లు అర‌వింద్‌, ఆహా సీఈఓ అజిత్ ఠాగూర్ స‌హా ఎంటైర్ ఆహా టీమ్ పాల్గొంది. ఈ కార్య‌క్ర‌మంలో ‘అన్ స్టాపబుల్’ ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...


నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ ‘‘నేను విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్ష‌కాభిమానులను ఎప్పుడూ అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాను. అలాగే ప్రేక్ష‌కులు కూడా నాపై ప్రేమాభిమానాలు చూపిస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతో చేయాల‌ని ప్రేర‌ణ క‌ల‌గ‌డానికి కార‌ణం ప్రేక్ష‌క దేవుళ్లే. కొత్త‌ద‌నాన్ని ఆద‌రించ‌డంలో ఎప్పుడూ త‌న తెలుగుజాతి ముందుంటుంది. ఈ క్ర‌మంలో ‘ఆహా’ ఓటీటీ మాధ్య‌మంగా తెలుగువారికి చేరువైంది. అల్లు అర‌వింద్‌గారికి మాన‌స పుత్రిక ఇది. ఎన్నో ఓటీటీ మాధ్య‌మాల మ‌ధ్య‌లో వాటికి పోటీగా మ‌నం కూడా నిల‌బ‌డుగ‌లుగుతామ‌ని ఆహాతో తెలుగువారు నిరూపించారు. అల్లు అర‌వింద్‌గారు గ్రేట్ లెజెండ్ క‌మెడియ‌న్ అల్లు రామ‌లింగ‌య్య‌గారికి కొడుకు మాతో ఎప్పుడూ స‌న్నిహిత సంబంధాల‌ను క‌లిగి ఉన్నారు. మేం చిన్నపిల్ల‌లుగా ఉన్న‌ప్పుడు మా ఇంటికి అల్లు రామ‌లింగ‌య్య‌గారు వ‌చ్చేవారు. అలా వ‌చ్చిన‌ప్పుడు నేరుగా వంటింటికి వెళ్లి అమ్మ‌గారితో మాట్లాడి, ఆమె చేత్తో టీ పెట్టించుకుని తాగేవారు. ఇండ‌స్ట్రీలో అలాంటి అనుబంధం ఉన్న వ్య‌క్తి అల్లు రామ‌లింగ‌య్య‌గారు. ఆయ‌న కుమారుడిగా అర‌వింద్‌గారితో నాకు మంచి స్నేహ బంధం ఉంది. ‘ఆహా’లో అద్భుత‌మైన టీమ్‌తో ప‌నిచేశాను. ఆ టీమ్‌లో ఓ భాగంగా క‌లిసి పోయాను. టీమ్ వ‌ర్క్‌గా చేయడం ఎప్పటికీ స‌క్సెస్‌. ఒక మ‌నిషి కావ‌చ్చు లేదా మెషీన్ కావ‌చ్చు. దాని ప్రెజంటేష‌నే ఆహాలో రాబోతున్న అన్ స్టాప‌బుల్. న‌ట‌న అంటే ఏదో అర‌వ‌డ‌మో, న‌డ‌వ‌డ‌మో కాదు.. ఓ పాత్ర ఆత్మ‌లోకి ప్ర‌వేశించ‌డం. ఆహాలో ఇప్పుడు నేను చేస్తున్న అన్‌స్టాప‌బుల్లో యాంక‌ర్‌గా చేస్తున్నాను.


ఇండ‌స్ట్రీ అన్నాక పోటీ ఉంటుంది. అలాగే రాజ‌కీయాల్లో అయినా పోటీ ఉంటుంది. పోటీ లేక‌పోతే అబివృద్ధి ఉండ‌దు. కానీ వాటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌నిషిగా ఆవిష్క‌రించ‌బ‌డే ప్ర‌క్రియ‌ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రోగ్రామే అన్‌స్టాప‌బుల్‌. మ‌నిషి జీవన ప్ర‌యాణంలో ఎన్నో ఒడిదొడుకుల‌ను ఎదుర్కొంటాడు. అలా ప్ర‌యాణించేట‌ప్పుడు త‌నొక ల‌క్ష్యాన్ని ముందుంచుకుని వెళ‌తాడు. అలాంటి ల‌క్ష్యాన్ని చేర‌డ‌మే ఈ అన్‌స్టాప‌బుల్ కార్య‌క్ర‌మం. ఈ కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో నేను ప్రోగ్రామ్ చేయ‌డానికి ఒప్పుకున్నాం. చాలా మంది నటీన‌టుల‌ను ఈ కార్య‌క్ర‌మంలో క‌లుసుకుని వారిని కంఫ‌ర్ట్ జోన్‌లో ఉండేలా చూసుకుని మ‌న‌సులోని విష‌యాల‌ను ఏం చెప్పాల‌నుకుంటున్నారో దాన్ని చెప్పేలా చూడ‌ట‌మే ఈ ప్రోగ్రామ్‌. అర‌వింద్‌గారికి ఇండ‌స్ట్రీలో చాలా మంచి పేరుంది. స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌, కొడుకు, తండ్రి. ఆయ‌న నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మం క‌చ్చితంగా మెప్పిస్తుంది. ప్ర‌తి మ‌నిషిలో క‌ష్ట సుఖాలుంటాయి. వాటిని బ‌య‌ట‌కు చెప్పుకుంటే మ‌న‌సులో బ‌రువు త‌గ్గుతుంది. అలా చేస్తే అది కూడా ఓ సేవే. అలాంటి సేవ‌లో భాగ‌మే ఈ అన్‌స్టాప‌బుల్‌’’ అన్నారు. 


అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ‘‘‘ఆహా’లో ‘అన్ స్టాప‌బుల్‌’ టాక్ షో చేయ‌డానికి ఒప్పుకున్న బాల‌కృష్ణ‌గారికి థాంక్స్‌. బాల‌కృష్ణ‌గారు సినిమాల్లో న‌టిస్తారు. కానీ బ‌య‌ట ఎలా ఉండాలో అలాగే త‌న ఎమోష‌న్స్‌ను చూపిస్తారు. కోపం వ‌చ్చినా, సంతోషం వేసినా ఆయ‌న దాచుకోరు. అలా మ‌న‌సులోని ఎమోష‌న్స్‌ను అలా ఓపెన్‌గా చూపించే స్టార్ టాక్ షో చేస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆయ‌న‌తో టాక్ షో అన‌గానే మా ఆహా టీం అంతా ఎగ్జ‌యిట్ అయ్యాం. ఈ టాక్‌షోతో పాటు, ఆయ‌న అఖండ సినిమా కూడా అఖండ‌మైన స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. బాల‌కృష్ణ‌గారికి నా ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు. ఈ ఏడాది చివ‌ర‌కు ఆహా రెండు మిలియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ చేరుకోవాల‌ని టీమ్ అంద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నారు. అన్ని భాష‌ల‌తో మిళిత‌మైన ఇత‌ర ఓటీటీ మాధ్య‌మాలు కూడా ఆశ్చ‌ర్య‌పోయే నెంబ‌ర్స్ ఆహాకు వ‌స్తున్నాయి. ఈ స‌క్సెస్ కార‌ణం తెలుగువారు ఇచ్చే ఎంక‌రేజ్‌మెంట్‌. నేను రెగ్యుల‌ర్‌గా ముంబై వెళుతుంటాను. ఒక‌ప్పుడు తెలుగు సినీ ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిన వ్య‌క్తిని చూసే విధానం ఇప్పుడు చూసే విధానం ఎంతో మారింది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌పంచ వ్యాప్తంగా స‌త్తాను చాటింది. దానికి కార‌ణం తెలుగు ప్రేక్ష‌కులే. అలాంటి గౌర‌వాన్ని నిల‌బెట్టే ప‌ద్ధ‌తిలోనే ఆహా కూడా ఉంటుంద‌ని తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు. 


ఆహా సీఈఓ అజిత్ ఠాగూర్ మాట్లాడుతూ ‘‘నందమూరి బాల‌కృష్ణ‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌న అందించిన స‌పోర్ట్ వ‌ల్ల ఓ మంచి టాక్ షోతో ఆహా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మైంది. మా ఆహా స‌క్సెస్‌లో భాగ‌మైన ప్రేక్ష‌కుల‌కు, మీడియాకు, టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.Share this article :