Home » » Dr M Prabhakar Reddy Statue Inaugurated at Chitra Puri Colony

Dr M Prabhakar Reddy Statue Inaugurated at Chitra Puri Colony

 


చిత్రపురి కాలనీలో డా. ఎం.ప్రభాకర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ

చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో ప్రముఖ నటులు, స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు ఎన్ శంకర్ చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, ఇతర కమిటీ సభ్యులు, ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మి, కూతుళ్లు  పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం అతిథులు సినీ కార్మికుల అభివృద్ధికి ప్రభాకర్ రెడ్డి చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా...



వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ....సినీ కార్మికుల సంక్షేమం కోసం డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన వల్లే ఇవాళ సుమారు నాలుగున్నర వేల కుటుంబాలకు నివాస సౌకర్యం ఏర్పడింది. చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయాలని 4 నెలల కిందటే అనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల వల్ల వాయిదా వేయాల్సివచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత కమిటీ పనిచేస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చిత్రపురిలో మిగిలిన నిర్మాణాలను పూర్తి చేస్తాం. ఆ గృహ ప్రవేశాలు జరిగే రోజున ప్రభాకర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని చిత్రపురిలో ఎత్తైన స్థలంలో ఏర్పాటు చేస్తాం. ప్రభాకర్ రెడ్డి గారికి సహకరించిన పెద్దలందరికీ సన్మానం చేయబోతున్నాం. మాకు సహకరిస్తున్న పరిశ్రమ పెద్దలకు కృతజ్ఞతలు. అన్నారు.



దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ....తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఎక్కువ కృషి చేసింది ప్రభాకర్ రెడ్డి గారే. ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో కార్మిక యూనియన్లు బలంగా నిలబడ్డాయి అంటే అందుకు ప్రభాకర్ రెడ్డి గారే కారణం. ఆయన ఎప్పుడూ కార్మికుల సంక్షేమం గురించే ఆలోచించేవారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని ఆశిస్తున్నాం. గతంలో ఫిల్మ్ నగర్ లో ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలని ప్రయత్నించాం కానీ జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. త్వరలో ప్రభాకర్ రెడ్డి గారి కాంస్య విగ్రహం పెడతామని ప్రెసిడెండ్ అనిల్ చెబుతున్నారు. సంతోషంగా ఉంది. అన్నారు.



నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ....సినీ కార్మికుల బాగు కోసం ఎం ప్రభాకర్ రెడ్డి గారితో పాటు దాసరి నారాయణరావు గారు కూడా చాలా కృషి చేశారు. చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారితో పాటు, దాసరి గారి విగ్రహాలు పెట్టాలని కోరుతున్నా. నేనే ఆ రెండు విగ్రహాలను డొనేట్ చేస్తాను. వీలైనంత త్వరగా వాటిని ఆవిష్కరించుకుందాం. అన్నారు.


ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ కోశాధికారి మహానందరెడ్డి, ఫెడరేషన్ సెక్రటరీ పీఎస్ఎన్ దొర, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



Share this article :